బడంగ్ పేట్ లో పల్స్ పోలియో డ్రైవ్ 2026: 5 ఏళ్ల లోపు పిల్లలకు జూలై 1 వరకు చుక్కలు


బడంగ్ పేట్ లో పోలియో వాక్సినేషన్ కార్యక్రమం


ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడమే లక్ష్యం – ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక తనిఖీలు



బడంగ్ పేట్ , జూన్ 28 (badangpet.in):

✍️ తటవర్తి భద్రిరాజు


పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో ప్రత్యేక కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. Badangpet మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మీర్‌పేట్, బాలాపూర్, ఆల్మాస్‌గూడ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, స్థానిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో బూత్‌లలో చిన్నారులకు చుక్కలు వేయనుండగా , జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలను గుర్తించి టీకా అందించేలా బృందాలను నియమించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న బడంగ్ పేట్ పై ప్రత్యేక ద్రుష్టి 


గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తున్న badangpet , మీర్‌పేట్, బాలాపూర్, ఆల్మాస్‌గూడ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

నిర్మాణ ప్రదేశాలు, అద్దె గృహాలు, వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, బస్తీలు, అపార్ట్‌మెంట్ సముదాయాలు, తాత్కాలిక నివాస ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ బృందాలు పర్యటిస్తున్నాయి. అవసరమైతే పిల్లల వివరాలను నమోదు చేసి వెంటనే పోలియో చుక్కలు వేస్తున్నారు.

ట్రాన్సిట్ బూత్‌ల ద్వారా ప్రయాణికుల పిల్లలకు సేవ


ప్రయాణాల్లో ఉన్న కుటుంబాల పిల్లలు కూడా టీకా మిస్ కాకుండా ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాన్సిట్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. బాలాపూర్, మీర్‌పేట్, ఆల్మాస్‌గూడ ప్రాంతాల్లో ఈ బూత్‌ల ద్వారా వందలాది మంది చిన్నారులకు సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పట్టణ జిల్లాలకు ప్రత్యేక పొడిగింపు 


జనాభా అధికంగా ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రతి చిన్నారిని చేరుకునే లక్ష్యంతో కార్యక్రమాన్ని జూలై 1 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం బూత్‌లకు రాలేని పిల్లలు, ఇంటి వద్ద అందుబాటులో లేని కుటుంబాలను ఈ అదనపు రోజుల్లో ప్రత్యేకంగా సందర్శించనున్నారు.

వ్యాక్సిన్ కొరత లేకుండా ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40.97 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 52.04 లక్షల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) డోసులను జిల్లాలకు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లాకు కూడా అవసరమైన మేర టీకా నిల్వలు అందుబాటులో ఉంచి, కోల్డ్‌చైన్ వ్యవస్థ ద్వారా నాణ్యతను కాపాడుతున్నారు.

వేలాది మంది సిబ్బంది సేవలు 


ఈ మహోద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. బడాంగ్‌పేట్ పరిధిలో ఉదయం నుంచే పోలియో బూత్‌లు పనిచేస్తుండగా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ 


వైద్య ఆరోగ్య శాఖతో పాటు  బడంగ్ పేట్ 
మున్సిపల్ కార్పొరేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, రవాణా శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

పోలియోపై అప్రమత్తత ఎందుకు అవసరం?


తెలంగాణలో 2007 తర్వాత ఒక్క పోలియో కేసు కూడా నమోదుకాలేదు. అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పోలియో వైరస్ ఇంకా పూర్తిగా అంతరించిపోకపోవడంతో ప్రతి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో చుక్కలు వేసినా, ప్రతి విడతలో మళ్లీ వేయించడం ద్వారా రోగనిరోధక శక్తి మరింత బలపడుతుంది.


తల్లిదండ్రులకు విజ్ఞప్తి


మీ ఇంట్లో లేదా మీ పరిసరాల్లో ఐదేళ్ల లోపు పిల్లలు ఉంటే తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి. బూత్‌కు వెళ్లలేకపోతే ఇంటికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించండి. ఏ చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడడం ప్రతి కుటుంబం సామాజిక బాధ్యత. 

ఈ వార్త ను పిల్లలు ఉన్న తల్లి తండ్రులకు షేర్ చేయండి. 

"రెండు చుక్కల జీవం... పోలియో రహిత భవిష్యత్తుకు ప్రతి చిన్నారి హక్కు."


ఇవి కూడా చదవండి 


Post a Comment

కొత్తది పాతది
Badangpet.in