బడంగ్‌పేట్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన కార్యక్రమం.. కీలక సూచనలు చేసిన అధికారులు


badangpet sir programme


బడంగ్‌పేట్, జూలై 4 (న్యూస్): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా నిష్పాక్షికంగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి దశను జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వారు పేర్కొన్నారు.


బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (డిప్యూటీ సీఈవో) జయచంద్రరెడ్డి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) జగదీశ్వర్‌రెడ్డి, డి.సి  సమ్మయ్య పాల్గొని అధికారులు, పొదుపు సంఘాల మహిళలు, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు.

అత్యంత కీలకం 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. అర్హులైన ఓటర్లు ఎవ్వరూ జాబితాకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలపైనా ఉందన్నారు. 

కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత తప్పనిసరిగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే నివాసం మారిన వారు, వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉన్న వారు సంబంధిత దరఖాస్తులను సమర్పించి తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు.

భవిష్యత్ లో ఇబ్బందులు 


ఎన్యూమరేషన్ ఫారాలను నింపే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఇంటి చిరునామా, వయస్సు, మొబైల్ నంబర్ తదితర వివరాలను స్పష్టంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. చిన్నపాటి పొరపాట్లు కూడా భవిష్యత్తులో ఓటరు జాబితాలో ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని వివరించారు.

ప్రజల భాగస్వామ్యం అవసరం 

పొదుపు సంఘాల మహిళలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 

తమ పరిసరాల్లోని ప్రతి కుటుంబానికి ఎన్యూమరేషన్ ప్రక్రియ గురించి తెలియజేయడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకునేలా సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఎలాంటి రాజకీయ వత్తిడులు ఉండవు 

ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ప్రభావాలకు తావు లేకుండా పూర్తిగా నిష్పాక్షికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

ప్రజలు కూడా అధికారులకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి ఓటరు వివరాల నమోదు, సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, ఏ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి, సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటి, వాటిని ఎలా నివారించాలనే అంశాలపై అధికారులు ప్రత్యక్షంగా వివరణ ఇచ్చారు. 

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని
 నిర్ణయించారు.











Post a Comment

కొత్తది పాతది
Badangpet.in